“మధురమైన telugu stories ప్రపంచంలో మిమ్మల్ని మురిపించేందుకు, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే కథలను ఈ Article లో చదవండి .”

పూర్వం ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది గొప్ప సాధు స్వభావం గలది. తోటి ఆవులతో ఎన్నడూ పోట్లాడేదే కాదు. ఇంత పచ్చగడ్డి వేస్తే తిని యజమానికి చిక్కని పాలిచ్చేది. ఒక రోజు ఆ అవు ఎప్పటిలాగే మేత కోసం అడవికి వెళ్ళింది.

రుచిగా ఉన్న పచ్చగడ్డి తింటూ తింటూ ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అక్కడొక చిన్న సెలయేరు ఉంది. ఇంతలో నీళ్లు తాగడానికి అక్కడికొక పులి వచ్చింది. ఆవును చూడగానే దాడి చేసింది.

ఆవు గజగజ వణుకుతూ ఇలా విన్నవించుకొంది. “పులిరాజా! ఇంటి దగ్గర పాలు తాగే నా పసిపాప ఉంది. ఆ లేత దూడకు పాలిచ్చి వెంటనే తిరిగి వచ్చేస్తా. పాపం అది ఆకలికి నకనక లాడుతూ ఉంటుంది. నన్ను నమ్ము. నేను పాలివ్వగానే తిరిగి వచ్చేస్తా. రాగానే నన్ను నీవు భక్షించవచ్చు”. ఈ మాటలు విన్న పెద్ద పులి నవ్వుతూ “ఏమిటేమిటి ఇంటికి వెళ్లి నీ బిడ్డకు పాలిచ్చి మళ్లీ వస్తావా? ఇది నేను నమ్మాలా?” అంది.
అప్పుడు ఆవు మళ్లీ ఇలా దీనంగా వేడుకుంది. “పులిరాజా! నేను సత్యవాదిని. నా జన్మలో అబద్ధం ఆడిన రోజు లేదు. నన్ను నమ్ము. నా బిడ్డకు పాలిచ్చిన వెంటనే వచ్చి నీ ఆకలి తీరుస్తా”. సరే ఈ ఆవు ఎంత వరకు నిజం చెప్తుందో చూద్దాం అని పులి దానికి సమ్మతించింది. “నీ బిడ్డకు పాలివ్వగానే తిరిగి రావాలి సుమా. రాకపోయావో ఇవాళ కాకపోతే రేపయినా నీ ప్రాణం తీస్తా జాగ్రత్త” అని హెచ్చరించింది. అప్పుడు ఆవు “నువ్వు నీళ్లు తాగే లోపల రాకపోతే చూడు” అంటూ పరుగులు తీస్తూ ఇంటికెళ్లింది.

హాయిగా గంతులేస్తున్న తన దూడను పిల్చి త్వరగా పాలు తాగు అంది. దూడ ఆబగా పాలు తాగుతోంది. ఆవు తన బిడ్డను ప్రేమగా నాలుకతో నాకుతూ ఇలా చెప్పింది. “బిడ్డా! ఇవాళే నాకు ఆఖరు దినం. నేను వెంటనే అడవికి వెళ్లి పులి ఆకలి తీర్చాలి. రేపటి నుంచి నీకు ఈ అమ్మ కనిపించదు. నా మీద బెంగ పెట్టుకోవద్దు. పాలు మరచి పోయి యజమాని అందించే మేత తినడం అలవాటు చేసుకో. మంచి తనంతో బతుకు. నీవు మరణించాక కూడా జనం నిన్ను పొగడాలి సుమా”, ఆవుదూడ కన్నీరు కారుస్తూ ‘అలాగే అమ్మా’ అంది. ఆవు వెంటనే అడవికి వెళ్లి పులి దగ్గర ప్రత్యక్షమైంది.

“పులిరాజా! నా మాట నమ్మి నందుకు నీకు కృతజ్ఞతలు. నీ దయ వల్ల నేను నా బిడ్డకు పాలిచ్చి వీడ్కోలు చెప్పి రాగలిగాను. ఇక నీ ఆకలి తీర్చుకో” అంటూ ఆవు నిర్భయంగా కళ్లు మూసుకుంది. ప్రాణాలకు తెగించి మాట నిలుపుకున్న ఆవును చూసి పులికి నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది ఇంత సత్యమైన పశువులను నేనెన్నడూ చూడలేదే అనుకుంది. ఎంత పులి అయినా దానికీ ఒక హృదయం ఉంటుంది కదా! అందుచేత దానికి ఆవును తినబుద్ధి కాలేదు. దీనిని చంపి తినడం అన్యాయం అనుకుని ఇలా చెప్పింది. “మిత్రమా! నీ సత్యమైన మనసు నన్ను సముగ్ధుని చేసింది. నిన్ను నేను చంపను. తిరిగి నీ బిడ్డ దగ్గరికే వెళ్లిపో”.
పులి మాటలు ఆవును ఆశ్చర్యంలో ముంచెత్తాయి. పులి తనను తినకపోవడం తన నిజాయితీ, చిత్తశుద్దికి లభించిన కానుకగా భావించి సంతోషంగా ఇంటికెళ్లింది.
( నీతి: నిజాయితీ, చిత్తశుద్ధి మానవుడికి నిజమైన ఆభరణాలు)